రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో అనధికార కార్యక్రమాలు, బయట వ్యక్తుల వేడుకలు, రాజకీయ పార్టీల కార్యక్రమాలు, ప్రముఖుల పుట్టినరోజులు, వర్ధంతుల పేర్లతో జరిగే కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటివన్నీ కూడా విద్యార్ధులు రోజువారి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని అందువల్ల వీటిని నిషేధిస్తున్నట్టు తెలియజేసింది. పాఠశాలలకు ఏదైనా సామాగ్రిని అందజేయాలన్నా, లేదా ప్రముఖుల జయంతులు , వర్ధంతిలకు విద్యార్ధులకు ఏమైనా వస్తువులు ఇవ్వాలన్నా ఇకనుంచి నేరుగా విద్యార్థులకు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వరు. బహుమతులు ఇచ్చేప్పుడు లేదా స్కూల్ లో అన్నదానం చేసేప్పుడు విద్యార్ధులతో ఫోటోలు దిగడం గాని, ఉపన్యాసాలు చెప్పడం గాని ఇలాంటి వాటిని కూడా నిషేధించారు .
విద్యార్ధులకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు లేదా సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్ కు అందజేయాలని పేర్కొన్నారు .ఆ తర్వాత వారు చెప్పిన విధంగా స్కూల్ మేనేజ్మెంట్ లేదా హెడ్మాస్టర్ వాటిని పంపిణీ చేస్తారని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది . ఈ సందర్భంగా ఎవరు కూడా విద్యార్ధులతో ఫోటోలు తీసుకోవడం గాని ఆ సామాగ్రిని అక్కడ విద్యార్థుల కోసం ఇస్తున్నట్టుగానే అలాంటి ప్రకటనలు కూడా అక్కడ చేయకూడదు. పాఠశాల ఆవరణలో ఎటువంటి రాజకీయ గుర్తులుగాని, రాజకీయ నినాదాలు గాని, రాజకీయ నాయకులు కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు.
ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనని అలా లేనిపక్షంలో సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్లను బాధ్యులు చేస్తామని తెలియజేశారు. పాఠశాలలతో సమస్యలు ఏదైనా ఉంటే పాఠశాలల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుకు తెలియజేయాలని నేరుగా పాఠశాలలో పోయి అక్కడ వివాదాలు గాని చర్చావేదికలకు గాని అవకాశం లేదని కూడా స్పష్టం చేశారు. దీంతో ఇకనుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో విద్య అంశం తప్ప మరే విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేశారు..

