కలశ పూజ అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. కలశాన్ని పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని వేద పండితులు చెబుతున్నారు. ఈ పూజను శుభ సూచకంతో పాటు సమృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారని తెలిపారు. శుభ కార్యాలలో, దైవ కార్యక్రమాల్లో కలశ పూజ చేస్తుంటారు. కలశంలోని పవిత్రమైన జలము సకల అభిషేకాలకు, దైవ కార్యాలకు వాడతారు. ఈ కలశంలోని నీరు సమస్త నదుల నుంచి వచ్చినట్లని, సమస్త వేద మంత్రముల సారమని, సకల దేవతలు అందులో చేరి ఉన్నారనే భావనతో మంత్రపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు.
రాగి ,ఇత్తడి, వెండి లేదా మట్టి పాత్రను తీసుకొని నిండా నీరు పోస్తారు. దానికి పసుపు,కుంకుమ రాసి అందులో కొన్ని మామిడాకులు ఒక కొబ్బరికాయ ఉంచి, దాని చుట్టూ పసుపు దారాలను చుట్టి మంత్రపూర్వకంగా భగవారాధన చేస్తారు. క్షీరసాగర మధనం జరిగిన సమయంలో పరమాత్మ ఒక కలశంతో ఉద్భవించి, అందులోని అమృతాన్ని దేవతలకు పంచారని చెబుతారు. పూర్ణత్వానికి సంకేతమైన కొబ్బరికాయ, పవిత్రతకు సంకేతమైన మామిడాకులు, సౌభాగ్య చిహ్నాలయిన పసుపు, కుంకుమ లతో వేదమంత్రం మిళితమైన కలశాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దేవీ ఆలయాల్లో శుక్రవారం శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా భక్తులు కలశ పూజ నిర్వహించారు.

