22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

శ్రీహరికోట నుంచి జయహో నిస్సార్.

ఈ భూమండలాన్ని మొత్తం గగనతల నుంచి స్పష్టంగా పరిశీలన చేయగల ఒక ప్రతిష్టాత్మకమైన ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆధ్వర్యంలో నిస్సార్ అనే ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షానికి ప్రయోగించబోతున్నారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వేదికగా ఇది గగనతలానికి ఎగరనుంది. అంతరిక్ష ఉపగ్రహాల చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన ఉపగ్రహం. దాదాపు 1200 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు.

దీనికి ఖర్చు కంటే ఈ ఉపగ్రహంలో రూపొందించిన సాంకేతికత అత్యంత అధునాతనమైనది. భూమండలం మొత్తాన్ని స్పష్టంగా వీడియో లేదా ఫోటోలు తీసి పంపగల శక్తివంతమైన సాంకేతికత ఉన్న ఉపగ్రహం ఇదొక్కటే. ఈ ఉపగ్రహం భూమండలాన్ని ప్రతి 12 రోజులకు ఒకసారి చుట్టి వస్తుంది. అలా తిరుగుతున్న సమయంలోనే హై రెసొల్యూషన్ డేటాతో ఫోటోలు తీస్తుంది. దీనికోసం రెండు రాడార్ కేంద్రాలను కూడా ఈ ఉపగ్రహంలో అమర్చారు. ఈ ఉపగ్రహం తీసే ఫోటోలు, వీడియోలు శాస్త్రవేత్తల అధ్యయనానికి బాగా ఉపయోగపడతాయి.

భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం ,అగ్నిపర్వతాల్లో మార్పులు, మంచు ఖండాలు కరుగుతున్న ఉదంతాలు, సముద్రమట్టాలు పెరుగుతున్నదృష్టాంతాలు, అడవుల విస్తీర్ణం, నేలలో తేమ గురించిన సమాచారం, మరియు భూగర్భ జల వనరులు ఈ ఉపగ్రహం ఫోటోలు తీసి పంపుతుంది. ఇది కాక వ్యవసాయ రంగానికి, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత కేంద్రాలకు పంపుతుంది . వాతావరణ నివేదికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన డేటాను పంపడంతో పాటు మేఘాలను అధ్యయనం చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ తన వంతుగా 780కోట్ల రూపాయలు వెచ్చించింది. మిగిలింది అమెరికా వాటాగా ఉంది. ఉపగ్రహ డేటాను ఏ దేశం అయినా ఉచితంగా వాడుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంతరిక్ష విజ్ఞానాన్ని, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలన్న ఒక లక్ష్యంతో ప్రతిష్టాకరమైన ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.