తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐదు వారాల పాటు నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B ఫైటర్ జెట్, ఎట్టకేలకు తిరిగి బయలు దేరింది. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన సమయంలో ఉపయోగించే హైడ్రాలిక్ సిస్టమ్ లోపాన్ని సరిదిద్దడంతో.. ఫైటర్ జెట్ ఎగరడానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జూన్ 14వ తేదీన UK నుండి ఆస్ట్రేలియాకు వెళుతున్న ఈ F-35B ఫైటర్ జెట్, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ తో త్రివేండ్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. భారత వైమానిక దళం ఈ ఫైటర్ జెట్ ల్యాండింగ్‌కు వీలు కల్పించి.. 5 వారాలుగా సహాయం చేసింది. అయితే ఈ ఫైటర్ జెట్‌ను తిరిగి దాని స్వదేశానికి తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఒక దశలో బ్రిటిష్ సాంకేతిక నిపుణులు C-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానంలో జెట్‌ను రవాణా చేయాలని కూడా భావించారు. అయినప్పటికీ అవేవీ ఫలించలేదు..
చివరగా జూలై 6వ తేదీన ఫైటర్ జెట్ లోని హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించేందుకు ఒక హ్యాంగర్‌కు తీసుకెళ్లారు. UK నుంచి వచ్చిన 24 మందితో కూడిన బృందం, బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుండి 14 మంది సాంకేతిక నిపుణులు.. మరియు 10 మంది సిబ్బంది.. కలిసి ఈ ఫైటర్ జెట్‌కు మరమ్మత్తులు పూర్తి చేశారు.
ఈ ఫైటర్ జెట్ గత 35 రోజులుగా ఎయిర్ పోర్టులోనే ఉడటంతో.. ల్యాండింగ్ మరియు రోజువారీ పార్కింగ్ ఛార్జీలు కూడా బాగానే అయ్యాయి. F-35B ఒకరోజు పార్కింగ్ చార్జీ 26,000 రూపాయల వరకూ వసూలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 35 రోజులకు గానూ 9 లక్షల రూపాయలు చార్జీ చేసినట్టు తెలిసింది. మొత్తానికి 35 రోజుల తర్వాత F-35B తన స్వదేశానికి ఎగిరిపోయింది.

