మన తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఒక్కో విశిష్టత ఉంది. కార్తీకమాసం శివారాధనకు, గృహప్రవేశాలకు, పూజలకు శుభకరమైన మాసం. వైశాఖమాసం పెళ్లిళ్లకు మంచిది. మార్గశిర మాసం విష్ణువుని పూజించడానికి ఇలా ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది.అయితే ఆషాడ మాసంలో మాత్రం ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. ఈ మాసంలో శుభకార్యాలు చేయకపోయినా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉపవాసాలు, వ్రతాలకు ప్రాముఖ్యత ఉంది.ఈ మాసంలో శాకాంబరి దేవి అలంకారంలో అమ్మవారిని పూజించడం వల్ల ఆధ్యాత్మికంగానూ, శారీరకంగాను బలం చేకూరుతుందని విశ్వసిస్తారు.
శాకాంబరి అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మొదలైన వాటితో అమ్మవారిని అలంకరిస్తారు. ప్రపంచానికి శాకాంబరి ఉత్సవాలను పరిచయం చేసిన ఘనత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానికి చెందుతుంది. వందేళ్ళ కరువు ఒకేసారి సంభవించినప్పుడు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని అలాంటి సమయంలో భద్రకాళి అమ్మవారిని వేడుకోగా తన శరీరం నుంచి ధనధాన్యాలు, కూరగాయలు, అన్న పానీయాలు విడిచి ప్రజల కష్టాలు తీర్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.
కష్ట కాలంలో అమ్మవారు ప్రజల ప్రాణాలను కాపాడారు కాబట్టే, అప్పటినుండి అమ్మవారిని అనేక రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోందని పండితులు చెబుతున్నారు. అమ్మవార్లను ఇలా పూజించడం వల్ల కరువు కాటకాలు దరి చేరవని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ నమ్మకంతోనే ప్రతి ఏటా ఆషాడ మాసంలో శాకాంబరి పూజలు నిర్వహిస్తుంటారు. నెల్లూరు జిల్లా పొదలకూరు లోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారిని కూరగాయలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారితో పాటు ఆలయాన్ని కూరగాయలతో సుందరంగా అలంకరించారు.

