సుఖ నిద్ర మంచి ఆరోగ్యానికి తొలిమెట్టు. చీకు చింత లేకుండా కంటి నిండా నిద్రపోగలిగితే ఏ వ్యాధులు దరి చేరవని వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నేటి కాలం ఆధునిక వైద్యం చెప్పే మాట కూడా కాదు. ప్రాచీన కాలం నుంచి కూడా చెప్పే ఒక గొప్ప ఆరోగ్య రహస్యం. రోజుకు ఐదు నుంచి ఏడు గంటలు సుఖనిద్ర శుభమైన ఆరోగ్యానికి తొలిమెట్టని చెబుతున్నారు. ఇంతకు మించిన శక్తివంతమైన ఔషధం కూడా మనిషి ఆరోగ్యానికి లేదని ఢంకా భజాయించి చెబుతున్నారు.
మనం నిద్రపోతున్నప్పుడు వివిధ రకాల హార్మోన్లను శరీరం దానికి అదే మళ్ళీ క్రమబద్ధం చేస్తుంది. మేల్కొన్నప్పుడు పడే టెన్షన్, అలసట, ఆందోళన, ఆత్రుత, బాధ, వీటన్నిటి కారణంగా దారిదప్పిన హార్మోన్ వ్యవస్థను నిద్ర ఒక్కటే దారికి తెస్తుంది. సరిచేస్తుంది . ఆహార జీర్ణ వ్యవస్థను క్రమబద్ధంచేస్తుంది. శరీరంలో ఎక్కువ నిల్వ ఉన్న కొవ్వును కూడా కాల్చివేస్తుంది. మెదడుకు సంబంధించి అనవసరమైన వ్యర్ధాలను బయటికి పంపించడంలో నిద్ర బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
మనిషి నిద్రలో ఉన్నప్పుడు మెదడు కూడా విశ్రాంతి తీసుకునే క్రమంలో వ్యర్ధ రసాయనాలను బయటకు పంపడం ప్రారంభిస్తుంది. దీనివల్ల ప్రశాంతంగా నిద్రలేచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నిద్ర అనేది శరీరాన్ని ప్రతి రోజూ మరమ్మత్తు చేసే మిషన్. ఇదొక తిరుగులేని ఆరోగ్య ఆయుధమని చెప్తారు . నిద్ర శరీరానికి పునరుత్తేజం కలిగించి ,శరీరంలో అన్ని భాగాలను సక్రమంగా పనిచేసేట్టు చేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
నిద్రను వేళ తప్పిస్తే శరీర నిర్మాణ వ్యవస్థ కూడా గాడిదప్పుతోంది. జ్ఞాపక శక్తిని కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది . అందువల్ల మనిషికి చౌకగా దొరికే అతి మేలైన ఔషధం నిద్ర మాత్రమేనని శాస్త్రవేత్తలు తేల్చేశారు. ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప ఔషధం సుఖమైన నిద్ర అని చెప్పారు.

