వైసిపి అధినేత జగన్ కి పొలిటికల్ ట్యూషన్ మాస్టర్ సరైనోడు కాదా ..? లేక అతడు తెలివైన వాడు అయినా జగన్ వినడంలేదా..? వ్యక్తిగతంగా జగన్ జనంలో ఒక శక్తి. దానిలో ఎటువంటి అనుమానంలేదు. ఎన్నికలలో గెలుపు, ఓటమి సహజం. అయితే వైసిపి దారుణ ఓటమి మాత్రం జగన్ చేజేతులా చేసుకున్నదే. ఆయన పరిపాలాదక్షుడు కాదన్న అభిప్రాయం జనంలో ఉందన్న విషయాన్ని ఆయన ఇప్పటికీ ఒప్పుకోలేకున్నారు.
పాపులిస్టిక్ నేతల పార్టీల్లో గెలుపు అయినా వారిదే, ఓటమి అయినా వారిదే. ఎందుకంటే వాళ్ళ ఛరిస్మా ,మీదనే పార్టీలు బ్రతుకుతాయి.ఎన్నికలు జరుగుతాయి. జగన్ ప్రభుత్వంలో మంత్రులు నామమాత్రమే. అధికారమంతా ఆయన చుట్టూ ఉన్న కిచెన్ క్యాబినెట్ డే.. రాజ్యాంగేతర శక్తులదే. దీనిలో తోలాపాపం తలాపిడికెడు అన్నట్టు ఆ 12 మంది పాపం కూడా ఉంది.
జగన్ పథకాలవల్ల లబ్ధిపొందిన వారు జగన్ పార్టీకే ఓటేశారు. ఇందులో అనుమానంలేదు. కాకపోతే ఐదేళ్ల పాలనలో మేలు జరిగినదానికంటే చేడు ఎక్కువ జరిగింది. అది ఇప్పటికీ జగన్ అర్ధం చేసుకోవడంలేదు. పరిపక్వమైన రీతిలో ఆయన మాటలు ఉండటంలేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలన్న డిమాండ్ కూడా అలాంటిదే. దీనిలో చట్టం, సాంప్రదాయం రెండూ ఉంటాయి. వీటిలో దేనిలోనూ జగన్ కి ప్రతిపక్షనేత హోదాకు అవకాశంలేదని తెలుసు.
ఆయన అసెంబ్లీకి రాకూడదు అనుకుంటే ఆ విషయం నేరుగా చెప్పేసి ఉండాల్సింది. లేదా రాకుండా , అప్పుడప్పుడు ఎమ్మెల్యే పదవికి డోకా లేకుండా ఉండేందుకు ఇప్పుడులాగానే అప్పుడప్పుడూ పోయివచ్చిఉంటే బాగుండేది. జగన్ స్థాయికి హుందాగా ఉండేది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

