ప్రపంచంలో శాస్త్ర ,సాంకేతిక విజ్ఞానం ఎంతగా పరుగులు తీస్తుందంటే నిద్రలేచేప్పటికీ నిన్నటిది నేటికి పాతదైపోతుంది. కొత్త కొత్త ఆవిష్కరణలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా విండ్ మిల్ అంటే పవన విద్యుత్ స్థానంలో ఇళ్లపై పెట్టుకునే ఓ చిన్న విద్యుత్ ఉత్పత్తి సాధనం ఇప్పుడు సంచలనమైంది. ఇప్పటివరకు సోలార్ పవర్ అంటూ పెద్ద పెద్ద పలకలు ఇంటిమీద పెట్టుకునేవారు.ఇలా హంగామా లేకుండా ఒక చిన్న స్తంభానికి 80 సెంటీమీటర్లు ఎత్తులో త్రికోణాకృతిలో పైపులు పెట్టేస్తే విద్యుత్తు ఉత్పత్తి అయిపోతుంది. అది ఎలా అని ఆశ్చర్యపోతున్నారా..?
ఇప్పటివరకు గాలి మరలకు పెద్ద రెక్కలు అమర్చాలి. గాలి ఉంటేనే టర్బో తిరిగి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇలాంటివి కార్పొరేట్ సంస్థలు చేపట్టే కార్యక్రమాలు. ఊరు బయట కొండల మీద వందలాదిగా పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంటారు . అయితే తాజాగా గ్లాస్కో యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఈ చిన్న పైపుల సాధనం విండ్ మిల్ మాదిరి ఉపయోగపడుతొంది. దీంట్లో దాని మాదిరి రెక్కలు కలిగిన ఫ్యాన్ ఉండదు. దీనిలో త్రికోణకృతిలో మూడు పైపులు ఉంటాయి. ఈ పైపులు గాలికి ముందుకు వెనక్కి ముందుకు ఊగులాడుతుంటాయి. అంటే ప్రకంపనలు కలుగుతుంటాయి.
ఇలా ఉగులాటడం వల్ల వచ్చే గతి శక్తి విద్యుత్తుగా మారి ఆ ఇంటికి అవసరమైన విద్యుత్తును అందజేస్తుంది. లేదా ఈ విద్యుత్ ని గ్రిడ్ కి సరఫరా చేసుకోవచ్చు. దీంతో 460 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయొచ్చు . శబ్దం లేకుండా ,ప్రమాదం లేకుండా ఇవి పనిచేస్తాయి. వీటి మీద పక్షులు కూడా వాలొచ్చు . వీటి మెయింటినెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. వీటిని ఇంటి పైకప్పుల మీద ,నివాస గృహాల మధ్యలో ,తోటలు , పొలాలు ఉన్నవారు, వారి పొలాల్లో పెట్టుకోవచ్చు. రాబోయే కాలంలో ఇది ఒక విప్లవాత్మకంగా మారబోతుంది.

