ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు నెలకొన్నాయని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ ముఖ్యమంత్రి ,పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు . తప్పుడు కేసులు ,అరెస్టులతో ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రాన్ని శాంతిభద్రతల విషయంలో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో రక్తం పారుతోందని అన్నారు.
వైసీపీ నాయకులను , క్రియాశీలక కార్యకర్తలను టార్గెట్ గా చేసుకొని కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఒక అరాచకాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు .గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే ఒక దళిత సర్పంచిని పట్టపగలే హత్య చేయించారని, ఈ సంఘటన ఒక్కటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, చట్టం ఎంతగా అదుపు తప్పిందో నిరూపిస్తుందని అన్నారు. నాగమల్లేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగలేదని ఆయన చర్యలు తమకు అడ్డంకిగా ఉన్నాయని అన్నారు.
ఈ దాడిని ఒక పద్ధతి ప్రకారం జరిపించారని ఆరోపణ చేశారు. తన ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని ,అలాంటి వ్యక్తులు ఆ పదవిలో ఉండడానికి అర్హులు కాదని అన్నారు. రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం, శాంతి భద్రతల విషయంలో విఫలమైన ప్రభుత్వం, చట్టాన్ని ఉల్లంఘించే ప్రభుత్వం ఉండకూడదని అందువల్ల ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదో తాను ప్రశ్నిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.

