చెత్త చెత్త అంటావేమిరా, చెత్తలోనే ఉందిరా జగమంతా.. అన్న ఓ కవి మాటలు నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాఫీ ఇటుకల తయారీని చూస్తుంటే. అనేక పదార్థాలను కనుగొన్న సాంకేతిక విప్లవం ఇప్పుడు తాజాగా కాఫీ గింజల, ఆకుల వ్యర్ధాల నుంచి అద్భుతమైన ఇటుకలను తయారు చేయొచ్చు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .ఈ ఇటుకలు సాధారణంగా మనం మట్టి నుంచి తయారు చేసే ఇటువంటి ఇటుకలకన్నా గట్టిగా ఉంటాయని , దానికంటే ఎక్కువ గట్టిదనాన్ని, మన్నికను ఇస్తాయని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంట్లో వాతావరణాన్ని నియంత్రణ చేస్తాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ మేరకు వాళ్ళు చేసిన పరిశోధనలు కూడా విజయవంతం అయ్యాయి. ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఈ కాఫీ ఇటుకలతో ఓ ఇల్లు కూడా కట్టేశారు. కాఫీ తోటల్లో వ్యర్థాలను ఇటుకల మట్టితో కలిపి ఇటుకలు చేస్తే ప్రస్తుతం సంప్రదాయంగా వస్తున్న ఇటుకలు కంటే తేలిగ్గాను, గట్టిగానూ మరియు వాతావరణ నియంత్రణకు సాధనంగాను, చౌకగాను ఉంటాయని చెప్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం ఇటుకలు తయారు చేసే కొలిమి నుంచి వచ్చే కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుంది. కాఫీ వర్గాలతో కలిపిన ఇటుకల మట్టిని తక్కువ వేడి తోనే ఇటుకలుగా తయారు చేయొచ్చు. ఇందు కోసం ప్రత్యేక కొలిమిని కూడా రూపొందించారు. ఇది ఆచరణలోకొస్తే ఒక అద్భుతమైన సాంకేతిక విప్లవం గృహ నిర్మాణ రంగాల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది.

