వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఆయనకు, ఆయన హెలికాప్టర్ కు ఇప్పుడు ఓ చిక్కు వచ్చి పడింది. అది కూడా నెల్లూరులో వైసీపీ నేతలకు ఓ పెద్ద సమస్యగా మారింది. వారి నాయకత్వానికి, ప్రతిష్టకు ఓ పరీక్షగా నిలిచింది. ఈ నెల మూడో తేదీన మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైల్లో ములాఖాత్ ద్వారా పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నారు. వివిధ రకాల కేసులలో కాకాణి నెలన్నర రోజులుగా నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
జగన్ పరామర్శ కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హెలిపాడ్ సిద్ధం చేయాలని గత పది రోజులుగా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే విచిత్రం ఏమిటంటే వారికి హెలిపాడ్ కి స్థలం దొరకలేదు. ఇది ఒక విశేషం అయితే వారు స్థలం కోసం ప్రయత్నం చేసేది నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే ప్రాంతం. దీంతో జగన్ హెలికాప్టర్ దిగేందుకు స్థలం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కి స్థలం ఇవ్వొద్దని పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు వైసిపి సొంత మీడియా సాక్షి లో కూడా ఓ పెద్ద కథనం వచ్చింది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే జగన్ హెలిపాడ్ కు స్థలం దొరకకుండా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు . అయితే ఇది వైసీపీ నేతలకు ఎంత అవమానకరంగా పరిణమించి, ఏకంగా పార్టీ నాయకుడు ప్రతిష్ట దిగజార్చిందో వారు తెలుసుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అవునన్నా కాదన్నా 40 శాతం ఓటింగ్ శక్తితో రాష్ట్రంలో రెండో బలమైన పార్టీగా, నేతగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వైసీపీ నేతకు ఆయన హెలికాప్టర్ దిగేందుకు అర సెంటు స్థలం సంపాదించుకోలేక పోతున్నారు. ఆయన హెలికాప్టర్ దిగేందుకే నెల్లూరులో వైసీపీ నేతలు స్థలం సంపాదించుకోలేకపోతున్నారు అంటే అది ఎంత అవమానకరమో వారికి అర్థం కావడం లేదు. ఈ మేరకు వైసిపి ప్రధాన కార్యాలయం నుంచి కూడా ఆదేశాల అందినట్టు తెలుస్తుంది.
రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి గత ఏడాది కాలంలో ఎప్పుడూ ఎదురుగాలేదని, ఎలాగైనా సరే హెలికాప్టర్ దిగేందుకు స్థలం సంపాదించి తీరాలని పార్టీ నాయకత్వం వారికి హుకుం జారీ చేసింది .చివరకు ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో హెలిపాడ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ యాజమాన్యం కూడా మొదట ఒప్పుకొని ఆ తర్వాత కాదన్నది. మళ్ళీ ఒప్పుకొని ల్యాండింగ్ కు అనుమతించింది. అయితే అక్కడ హైటెన్షన్ వైర్లు పోతుండడంతో దీన్ని అధికారులు ఒప్పుకోలేదు. చివరకు వైసీపీ నేతలు చేతులెత్తే పరిస్థితుల్లో అధికారులే కాకాణి ఉంటున్న సెంట్రల్ జైలుకు పక్కనే స్థలం చూపించి అక్కడ హెలిపాడ్ ఏర్పాటుకు ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను వైసీపీ నేతలు తిరస్కరించారు. ఎందుకంటే హెలిపాడ్ కి, జైలుకు దాదాపు ఒక అరకి కిలోమీటర్లు దూరం ఉంటుంది. అందులోనూ అది నిర్మానుష్య ప్రాంతం. జన సమీకరణకు వీలుకాదు. జగన్ కాన్వాయి పోయే దారిలో జనం మోహరింపు కుదరదు. అందువల్ల ఆ స్థలం మాకు వద్దని చెప్పేశారు. జగన్ పర్యటనలో వైసిపి నేతల సీక్రెట్ ఏజెండా వాస్తవానికి వేరే ఉంది. జన సమ్మర్థంగా ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే హెలిపాడ్ నిర్మిస్తే హెలికాప్టర్ దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జన సమర్థంగా ఉన్న ప్రాంతాల నుంచి వెళితే జనసమూహం వస్తుందని వారి ఆలోచన.
అందుకే నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే హెలిప్యాడ్ ఉండాలన్నది వారి ఆలోచన. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చూసి భయపడి రియల్ ఎస్టేట్ యజమానులు, సొంత పొలం ఉన్న వాళ్ళు స్థలం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఇది పెద్ద సమస్యగా పరిణమించింది. మరో రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో హెలికాప్టర్ లో దిగాల్సి ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు హెలిపాడ్ ఎక్కడ అన్నది స్థలం ఖరారు కాలేదు. చివరకు హెలిపాడ్ కోసం స్థలం దొరక్కపోతే విజయవాడ నుంచి కారులోనో లేదా రేణిగుంటకు విమానంలో చేరుకొని అక్కడి నుంచి కారులోనో నెల్లూరు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా జగన్ హెలికాప్టర్ కి స్థలం దొరకక పోయినాజగన్ పర్యటన ఆగదని , అది జరిగి తీరుతుందని ఆయన జైల్లో కాకాణినిపరామర్శిస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు..

