ఇండియన్ రైల్వే పరుగులు తీస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోజు రోజుకూ తనను తాను మార్చుకుంటోంది. కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకెళ్తోంది. రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తూ.. ప్రయాణీకులకు వసతులు మెరుగుపరుస్తూ.సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటివరకూ వందే భారత్ చూసిన ప్రయాణీకులకు.. ఇప్పుడు సరికొత్తగా అమృత్ భారత్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.నిజానికి ఈ అమృత్ భారత్ రైళ్లు.. గత ఏడాది తమ సేవలను మొదలు పెట్టాయి. అయితే త్వరలో సరికొత్త మార్పులు చేర్పులతో అమృత్ భారత్ 2.ఓ గా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో ఈ అమృత్ భారత్ ట్రైన్స్ గురించి, ప్రయాణీకులు ఆరా తీయడం మొదలు పెట్టారు. 2026 మార్చి నాటికి ఈ అమృత్ భారత్ ట్రైన్స్ దేశం మొత్తం నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. దాదాపుగా 50 ట్రైన్స్ ను ఇందుకోసం సిద్ధం చేస్తోంది. ఈ అమృత్ భారత్ ట్రైన్స్ సూపర్ ఫాస్ట్ గా ప్రయాణిస్తూ .. నాన్ ఏసీలో ప్రయాణికులకు సేవలందిస్తాయి. 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ ట్రైన్స్ లో మొత్తం 22 కోచ్ లు ఉంటాయి.
అందులో 20 కోచ్ లు ప్రయాణికులకు.. మరొక 2 పార్సిల్స్ కోసం వినియోగిస్తారు. ఒక్కొక అమృత్ భారత్ ట్రైన్ కోసం ప్రభుత్వం దాదాపుగా 65 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ అమృత్ భారత్ ప్రయాణం చేసే దూరం కనీసం 800 కిలోమీటర్లు ఉండేలా రూట్ తయారు చేస్తున్నారు. ఇందులో సీసీ కెమెరాలు.. కొత్తరకం సీట్లు.. సరికొత్త ప్రయాణ అనుభూతి కలిగేలా డిజైన్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ అమృత్ భారత్ ట్రైన్స్ ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అమృత్ భారత్ ట్రైన్స్ తయారవుతున్నాయి

