రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..? ఎప్పుడో ఏమోగానీ అప్పుడే వత్తిళ్లు మొదలయ్యాయి. పరోక్షంగా వినతులు , ప్రజలనుంచి సీఎం చంద్రబాబునాయుడుకి విజ్ఞప్తులు అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా నుంచి మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ , సర్వేపల్లి నియోజకవర్గంలోని అమ్మవారిపాలెం గ్రామంలో టిడిపి కార్యకర్తలు తిరుమలకు మహాపాదయాత్ర మొదలు పెట్టారు.
ఈ పాదయాత్రకు సోమిరెడ్డి కొడుకు రాజగోపాలరెడ్డి , కోడలు శృతి రెడ్డి జెండా ఊపి , సోమిరెడ్డికి మంత్రిపదవి రావాలని ఏడుకొండలవాడిని కోరుకునేందుకే గ్రామస్తులు పాదయాత చేస్తున్నారన్నారు. సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి ఇటీవలకూడా , మామ సోమిరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించామని , అయితే అనివార్య కారణాలవల్ల అది సాధ్యం కాలేదని చెప్పింది.
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో , ఎలా జరుగుతుందో గానీ , ఏడాది తరువాత ఇలా మంత్రివర్గంలో స్తానం కోసం ప్రజలనుంచి డిమాండ్ పేరుతో తమ కోరికలను నేతలు వెల్లడిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉంటుందో ఉండదా అనేదికూడా సందేహమే. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని నేరుగా చంద్రబాబు నాయుడే ప్రకటన చేసారు. దాని విషయమే ఇంతవరకు ఊసులేదు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఇలాంటి డిమాండ్లు రావడం విశేషమైంది.

