లంచాలు తీసుకుంటూ పట్టుబడితే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మళ్లీ ఆరు నెలలకో, తొమ్మిది నెలలకో ,మూడు నెలలకో జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగాల్లో చేరడం మనం చూస్తున్నదే . ఏసీబీ కేసుల్లో లేదా విజిలెన్స్ కేసుల్లో లేదా సిబిఐ కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ నగదుతో దొరికిపోయి ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తే కోర్టు సాధారణంగా వారిని జైలుకు రిమాండ్ కి పంపుతుంది. ఇలాంటి కేసుల్లో గరిష్టంగా మూడు నెలల పాటు బెయిల్ కూడా ఇచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక విచారణ కొనసాగుతుంది ఈ విచారణలోనే అసలు కిటుకుంది.
విచారణ ఆరు నెలలు లేదా తొమ్మిది నెలలో లేదా ఏడాదిలోగా పూర్తికాక పోతే ప్రభుత్వం వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటుంది. దీని వెనక సిఫార్సులు, రాజకీయ కారణాలు, ఇతరత్రా ఉందన్న విషయం నగ్నసత్యం.అయితే ఏసీబీ కేసుల్లో చిక్కి జైలు పాలు అయిన వారు మళ్లీ దొంగదారుల్లో ఉద్యోగాల్లో చేరడాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏసీబీకి ట్రాప్ అయిన ఉద్యోగులు ఆ కేసు పూర్తిగా కోర్టులో తేలే వరకు మళ్ళీ ఉద్యోగంలో చేరే అవకాశం లేదు. ఇప్పటి మాదిరి జైలు నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక వంకతో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి మళ్లీ లంచాల చేతివాటం రిపీట్ చేస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇలాంటివారు రిజిస్ట్రేషన్, రెవెన్యూ , పోలీస్ శాఖలో ఎక్కువమంది ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ తో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన ఏ ప్రభుత్వ అధికారిని లేదా ప్రభుత్వ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం నైతిక సూత్రాలకు, సహజ న్యాయ సూత్రాలకు, ప్రభుత్వ నియమాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అవినీతి కేసుల్లో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ వాళ్ళు నిర్దోషిగా తేలేవరకు సర్వీస్ లోకి తీసుకోకూడదని ఒక రూలింగ్ ఇచ్చింది. అవినీతి కేసుల్లో చిక్కిన వారు మళ్ళి డ్యూటీలో చేరితే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ప్రసన్న ధర్మాసనం పేర్కొంది. ఇందుకు సంబంధించి లంచం కేసులో దోషిగా తేలిన ఓ రైల్వే ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేసి సంచలనాత్మకమైన ఈ రూలింగ్ ఇచ్చింది.

