అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ తిరుమలలో దళారీల మోసాలు , దోపిడీలు యథేచ్ఛగా జరిగిపోతూనే ఉన్నాయి. దీనికి మూలకారణం ఎక్కడుందో అంతుపట్టదు. గత ప్రభుత్వంలో అయితే అధికారపార్టీ నేతలే దళారీల అవతారం ఎత్తి రెండు చేతులా సంపాదించారు. ఇప్పుడు నేతల సంగతేమో కానీ దళారీలు మాత్రం ఏదో ఒక అవతారంలో భక్తులను దోపిడీ చేస్తున్నారు. తాజాగా నకిలీ దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన ముఠా గుట్టు రట్టయింది.
మార్చి నెలలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని కుమారి. డి. సంగమిత్రకు శ్రీవారి సుప్రభాత సేవ, ప్రోటోకాల్ దర్శనం, వసతి టికెట్లు ఇప్పిస్తామని మదనదీపు బాబు అలియాస్ సందీప్, పవన్ కుమార్ అనే వ్యక్తులు 2.లక్షల 60 వేలరూపాయలు వసూలు చేసారు. , ఇవి బోగస్ టికెట్స్ అని తేలడంతో సంగమిత్ర తిరుమల రెండో టౌన్ పోలీస్ స్టేషన్ లోకి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వారిద్దరిపై కేసు నమోదు చేసారు. కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని టిటిడి సివిఎస్వో కె.వి. మురళీ కృష్ణ చెప్పారు.
శ్రీవారి దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని ఆయన కోరారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరీక్షించడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో భక్తులు పొందిన టికెట్లు నకిలీగా తేలితే అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందన్నారు. శ్రీవారి భక్తులకు మోసపూరిత మాటలు చెప్పి నకిలీ దర్శన టికెట్లు, వసతి కల్పిస్తామని దళారులు ఎవరైనా చెప్పినా నమ్మవద్దని టిటిడి సివిఎస్వో వెల్లడించారు.
దళారులు ఎవరైనా భక్తులను ప్రలోభాలకు గురి చేసి శ్రీవారి దర్శనం, వసతి ఇప్పిస్తామని, డబ్బులు పంపాలని ఎవరైనా ఫోన్ లు చేసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. టిటిడి విజిలెన్స్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని, సదరు నెంబర్ కు 0877 – 2263828 ఫోన్ చేసి అనుమానాలను భక్తులు నివృత్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, దళారులు శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో దందా చేస్తే వెంటనే సదరు మోసపూరిత వ్యక్తులు, దళారుల వివరాలను ఫోన్ చేసి టిటిడి విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

