పెళ్లిళ్ల ఖర్చులే వందల నుంచి వేలు, వేల నుంచి లక్షలు, లక్షలు నుంచి కోట్లకు పెరిగిపోయాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది ఆడంబరంగా మారింది . పెళ్లిలో హంగామా చేసుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. సాంప్రదాయం నుంచి పెళ్లి తంతు వ్యక్తి స్థాయికి ,హోదాకు, నిదర్శనంగా ప్రతిరూపంగా నిలిచిపోయింది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవాలంటే అప్పులు చేయడం అనివార్యమైంది. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకుని అప్పులు పాలై సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
స్థాయికి మించి పెళ్లిళ్లు చేసి అప్పులపాలై వీధినపడ్డ కుటుంబాలకు భారతదేశంలో లెక్కలేదు. వీటిని ఫ్యాట్ వెడ్డింగ్స్ అని కూడా అంటున్నారు. అది చాలక ఫోటోషూట్లు, మెహిందీలు, సంగీత్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, హనీమూన్ ఇలా రకరకాల పిచ్చిపిచ్చి కార్యక్రమాలన్నీ చేర్చి పెళ్లి అనే దాన్ని ఒక విలాసవంతమైన వేదికగా మార్చేశారు. ఈ తంతు నుంచి సామాన్య ప్రజలు బయటపడే ఆలోచనలు చేయడంలేదు.
ఇప్పుడు స్కూల్ అడ్మిషన్లలో ఆడంబరాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని వసాయిలో ఓ స్కూల్ టీచర్ తన కొడుకును స్కూల్లో చేర్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేశాడు. ప్లే క్లాస్ లో స్కూల్ లో తన బిడ్డను చేర్చేందుకు ఒక రోల్స్ రాయిస్ కారును అద్దెకు తీసుకుని దానికి పూలు, బెలూన్లు కట్టి బ్యాండ్ మేళంతో ముందు వెనక కార్ల ఎస్కార్ట్ తో తన బిడ్డను తీసుకువెళ్లి స్కూల్లో చేర్పించివచ్చాడు. అసలే ప్రైవేట్ స్కూళ్లు వ్యాపార ధోరణితో సామాన్యులను దోచుకు తింటుంటే ఇప్పుడు ఇలాంటి పద్ధతులకు అతడుబాట వేశాడు. దీన్ని మార్గదర్శకంగా తీసుకుని సామాన్య కుటుంబాలు అనుసరిస్తే మళ్ళీ అప్పులు పాలయ్యే పరిస్థితి తప్ప వేరే ప్రయోజనం లేదు.

