రాష్ట్రంలో ఒక ఉన్మాద,అవినీతి,అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, చంద్రబాబు ధోరణి ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉందని ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చెప్పారు. పునర్ నిర్మాణం పేరుతో చంద్రబాబు ఏడాది పాటు కాలయాపన చేశారన్నారు. పాలనను గాడిన పెడుతున్నాం అని చెప్పి చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలి కొదిలేశారని ,అప్పుల సాకు చూపి అభివృద్ధిని అటకెక్కించారన్నారు. నిధులు లేవని ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెట్టారని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంటే కనీసం నోరు విప్పలేదని అన్యాయమని ప్రశ్నించలేదని దుయ్యబట్టారు.ఇది ఇవ్వాళ ప్రజా తీర్పు దినం కాదు..ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినం అని విమర్శించారు.
ఈ పరిస్థితుల్లో వైసిపి నిర్వహించే వెన్నుపోటుదినానికి అర్థమే లేదన్నారు. రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని, వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ రైట్స్ , బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసనని షర్మిల అన్నారు. .ఏడాది కాలంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే,అరచేతిలో మళ్ళీ వైకుంఠం చూపిస్తుంటే, పథకాలు అమలు చేయకుండా కాకమ్మ కథలు చెప్తుంటే, ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గళం విప్పకుండా, ప్రతిపక్ష హోదా కావాలని అడిగి జగన్ అభాసుపాలయ్యాడని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, లిక్కర్ స్కాం ఆద్యుడు మీరే అని కూటమి దర్యాప్తు చేస్తుంటే, ఆన్ లైన్ లో కాకుండా క్యాష్ పద్ధతిలో లిక్కర్ సొమ్ము గురించి అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధం అని చెప్పే దమ్ము లేకుండా నిరసనలు చేస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లుంది.. అన్నా జగన్ నువ్వు కూడా వెన్నుపోటు దారుడీవే అని షర్మిల ధ్వజమెత్తింది.

