తిరుమల శ్రీవారిని మైసూర్ మహారాణి ప్రమోదాదేవి దర్శించుకున్నారు. శ్రీకంఠదత్త వడయార్ భార్య ఈ ప్రమోదాదేవి. ఈ ఉదయం శ్రీవారి సేవలో ఆమె పాల్గొన్నారు. రెండు భారీ వెండి అఖండ దీపాలను స్వామివారికి విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ అధికారులకు ఈ దీపాలను అందించారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుందని టీటీడీ సిబ్బంది తెలిపారు.

ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. వీరితో పాటుగా సినీనటి జయచిత్ర, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

