అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.. ఇది త్రివిక్రమ్ సినిమాలోని ఓ డైలాగ్.. సరిగ్గా ఇలాంటి అద్భుతమే ఇప్పుడు యూపీలో జరిగింది. ఆ అద్భుతాన్ని సృష్టించింది కేవలం 14 ఏళ్ల రామ్ కేవల్ అనే విద్యార్థి. ఇంతకీ రామ్ కేవల్ ఏం చేశాడనే విషయాన్ని ఈ స్టోరీలో చెప్పబోతున్నాం.. రామ్ కేవల్ పదవ తరగతి పాసయ్యాడు. అదేంటి పదవ తరగతి పాసవ్వడం ఏమైనా అద్భుతమా అంటారా..? అవును నిజంగా అది అద్భుతమే..యూపీలోని బారాబంకీ జిల్లాలోని నిజాం పూర్ లో గత 78 ఏళ్లుగా ఎవరూ పదవ తరగతి పాసవ్వలేదు. ఎంతోమంది.. ఎన్నో ఏళ్లుగా పరీక్షలు రాస్తున్నా.. ఒక్కరు కూడా పాస్ మార్కులు తెచ్చుకోలేదు.

అయితే ఈ గ్రామానికి చెందిన రామ్ కేవల్ ఇటీవల జరిగిన పదవతరగతి పరీక్షల్లో పాసయ్యాడు. దీంతో 78 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టినట్టయింది.రామ్ కేవల్ పగటిపూట బడికి వెళుతూ.. రాత్రి వేళల్లో పనులకు వెళ్ళేవాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రిళ్ళు జరిగే ఫంక్షన్ లలో లైట్లు మోసే పనికి వెళ్ళేవాడు.. అలా చదువుకుంటూ ఇప్పుడు పదవతరగతి పూర్తి చేశారు.ఈ విషయం తెలుసుకున్న ఊరంతా సంబర పడింది. తమ గ్రామంలో పదవతరగతి పాసైన వాడు ఉన్నాడంటూ ఆ గ్రామస్థులు ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ శశాంక్ త్రిపాఠి.. రామ్ కేవల్ ను అభినందించారు. కలెక్టర్ కార్యాలయానికి రామ్ కేవల్ ను.. అతని తల్లిదండ్రులను పిలిచి మరీ సన్మానం చేశాడు. పై చదువులకు అండగా ఉంటానని చెప్పారు. ఈ రామ్ కేవల్ ఇప్పుడు యూపీలో సంచలనంగా మారాడు.

