గత కాలం నాటి ఇంజనీర్ల మేధస్సుకు, ఆనాటి వస్తువుల నాణ్యతకు, పనిలో నిజాయితీకి ఇదిగో ఈ ఐరన్ బ్రిడ్జి ఒక నిదర్శనం. 1930 సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో నాయుడుపేట సమీపంలో చెన్నై , తిరుపతి వైపునకు సువర్ణముఖి నదిపై దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ బ్రిడ్జి ఇనుప స్తంభాలతో నిర్మించారు . అప్పటి వెంకటగిరి జమీందార్ దీన్ని ప్రారంభించారు. సున్నము, బండ రాళ్లతో కట్టిన దిమ్మలపై ఇనుప దూలాలు పెట్టి నిర్మించారు . దానిపై రోడ్డు వేశారు. ఇప్పటికీ 95 సంవత్సరాలు పూర్తయిన ఈ బ్రిడ్జి మాత్రం నేటికీ చెక్కుచెదరలేదు.
అయితే దీనికి కాలం చెల్లిందని సమీపంలోనే మరో బ్రిడ్జి నిర్మించారు. ఆ బ్రిడ్జి సగం కట్టిన తర్వాత నాలుగు స్పాన్ లు కూలిపోయాయి. ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా కూలదోసి అదే స్థానంలో మళ్ళీ కొత్త బ్రిడ్జి కట్టారు. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆ నిర్మాణం జరిగింది. ఈ ఐరన్ బ్రిడ్జి మాత్రం 95 ఏళ్ల నుంచి అలాగే చెక్కుచెదరకుండా ఉంది. ఇది ఆనాటి కట్టడాలకు నేటి కాంట్రాక్టర్లు ఇంజనీర్ల కట్టడాలకు ఉన్న తేడా.. ఇప్పటికి కూడా ఇనుము తుప్పు పట్టకుండా ఉందంటే నిజంగా చాలా గొప్ప విషయం .
ఇప్పుడు ప్రభుత్వ భవనాల్లోనూ ఇతర కార్యక్రమాలలో వాడే స్టీలు 15 నుంచి 20 సంవత్సరాలు తర్వాత తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది. కానీ బయటే ఉన్న ఈ స్టీలు 95 ఏళ్లగా అలాగే ఉంది. మరో వందేళ్ళ కూడా ఇలాగే నిలబడి అవకాశం ఉంది. ఇలాంటి వాటిని జాగ్రత్తగా కాపాడి వీటిని ఇంజనీరింగ్ విద్యార్ధులకు, భావితరాలకు ఒక పాఠంగా చెప్పగలిగితే ,ఆదర్శంగా నిలపగలిగితే మంచిది..

