కందుకూరు నుంచి బద్వేలు వెళ్లే హైవే పక్కన ఠీవిగా , అలనాటి చరిత్రకు సాక్షిగా, చెయ్యి తిరిగిన శిల్పకళా నైపుణ్యానికి ప్రతిరూపంగా ,పిచ్చి మొక్కల మధ్య , చెత్తకుప్పల మధ్య ఇప్పటికీ వెలిగిపోతున్న 50 అడుగుల ఏకశిల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆసక్తి ఉన్నవారు ఈ అద్భుతాన్ని హైవే పై వాహనాలు నిలిపేసి ,అక్కడికి పోయి చూసి వస్తారు.అదే ఓలేటివారిపాలెంలో అలనాటి జనార్ధన ఆలయం ముందున్న మెరిసిపోతున్న ఏకశిల స్తంభం. అది అపురూప ధ్వజస్తంభం .ఇప్పటికీ దాని నిర్మాణం జరిగి 800 సంవత్సరాలయింది. అయినా చెక్కుచెదరకుండా, ఎండలో మెరుస్తూ కనిపిస్తుంది. ఆ మెరుపులు ఎక్కడివో ఆ నాటి శిల్పులకే తెలియాలి.
1325 నుంచి 1448 సంవత్సరాల మధ్య రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ప్రోలయ వేమారెడ్డి కాలంలో రెడ్డి రాజులు తమ సామ్రాజ్యాన్ని ఆంధ్ర దేశం నుంచి ఒరిస్సాలోని కటక్ వరకు, దక్షిణాన కంచి వరకు ,పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించారు . ఆ కాలంలోనే మల్లయ్య రెడ్డి అనే రాజు ఒలేటివారి పాలెంలో జనార్ధన ఆలయాన్ని నిర్మించారు . ఆలయానికి ముందు అపురూప శిల్పకళా సంపదతో ఒకే ఒక్క రాతి స్తంభం మీద 50 అడుగుల ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఇప్పటికీ ఎనిమిది వందల సంవత్సరాలు అయినా ఆ దేవాలయం ధ్వజస్తంభం అలనాటి శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనంగా, పురావస్తు సంపదను ,అపురూప శిల్పకళా వైభవాన్ని కాపాడడంలో నేటి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా హైవే పక్కనే కనిపిస్తోంది .
ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న జనార్ధన ఆలయం ధ్వంసం అయిపోయింది. ఆలయంలో గుప్త నిధులు కోసం జరిపారు. జనార్ధన విగ్రహం కూడా ఎక్కడుందో ఎవరికీ తెలియదు . ఇలాంటి అరుదైన, అద్భుతమైన ప్రాచీన కట్టడాలను, ఆనాటి శిల్పకళా సంపదను, భావితరాల కళ్ళ ముందు నిలిపేందుకు వీటిని జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. మన దేశంతో సహా చాలా దేశాల్లో పురావస్తు సంపదను వెలకట్టలేని ఆస్తిగా భావించి భద్రపరుస్తారు. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బహుశా దేశంలో అతికొద్ది ఏకశిల రాతి స్తంభాలలో అద్భుతమైన కళా నైపుణ్యంతో ఉండే ఈ జనార్ధన ఆలయ రాతి స్తంభం ఆలయాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
ప్రాచీన ఈ కళాఖండాలను, చెత్తకుప్పల మధ్య, పిచ్చి చెట్ల మధ్య నిర్లక్ష్యానికి ప్రతిరూపంగా అలాగే ఉంచేసింది. ఇప్పటికైనా అపురూపమైన ఈ కట్టడాన్ని పురావస్తు శాఖ ఆధీనంలో ఉంచి కాపాడాల్సిన అవసరం ఉంది . ఓల్డ్ ఇస్ గోల్డ్ ,గతం ఎప్పుడూ ఘనమైనదే . ఆ ఘనమైన గతాన్ని కళ్ళ ముందు నిలపగలిగితే భావితరాలు గతం నుంచి గొప్ప పాఠాలు నేర్చుకుంటారు. మన సంస్కృతిని కాపాడుతారు..

